తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు

  • ప్రవీణ్ కాసం
  • బీబీసీ ప్రతినిధి
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి కారు గుర్తు

ఫొటో సోర్స్, trspartyonline/facebook

టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) 18 ఏళ్ల ప్రస్థానం పడిలేచిన కెరటాన్ని తలపిస్తుంది. ఆ కెరటంలాగే గులాబీ పార్టీ పడిపోయిన ప్రతీసారి లేచి తన ఉనికిని కాపాడుకుంది.

ప్రత్యేక రాష్ట్రమే ఏకైక అజెండాగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ప్రయాణంలో వైఫల్యాలు, విజయాలు దోబూచులాడాయి. చీలికలతో చితికిపోయిన ఆ పార్టీకి ఒక్కోసారి రాజీనామాలే ప్రాణం పోశాయి.

తెలంగాణ నినాదం, భావన వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థీకృతంగా మార్చడంలో , తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వ్యాపింపచేయడంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది.

జలదృశ్యం నుంచి...

ప్రొఫెసర్ జయశంకర్ లాంటివాళ్లు వ్యాసాలు, పుస్తకాలతో తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నిస్తున్న దశలో కేసీఆర్ రాజకీయ మార్గంలో ప్రత్యేక రాష్ట్రం సాధించాలని నిర్ణయించుకున్నారు.

ఈ దశలో కేసీఆర్ రాజకీయ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శనం చేశారు.

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలోని జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న కొంతమంది తెలంగాణ వాదుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు.

ప్రత్యేక రాష్ట్రమే ఏకైక అజెండాగా తమ పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. అప్పటి వరకు తాను ఉన్న టీడీపీ పార్టీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ కంటే ముందే అనేక పార్టీలు ఏర్పడ్డాయి. కొన్ని కనుమరుగయ్యాయి. మరికొన్ని కాంగ్రెస్‌లో కలిసిపోయాయి. టీఆర్ఎస్‌దీ అదేపరిస్థితి అనే విమర్శలు వచ్చాయి. మంత్రి పదవి ఇవ్వనందునే కేసీఆర్ పార్టీ పెట్టారని టీడీపీ నేతల నుంచి విమర్శలొచ్చాయి.

టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొన్ని నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చాయి.

ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఊహించని స్థాయిలో సీట్లు గెలుచుకుంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌ పదవులు టీఆర్ఎస్ వశం అయ్యాయి. పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కేసీఆర్ తెలంగాణలోని పది జిల్లాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి కృషి చేశారు.

టీఆర్ఎస్ పార్టీ

ఫొటో సోర్స్, kcr/fb

యూపీఏ1లో టీఆర్ఎస్.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఒత్తిడి

టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరగడంతో పాటు ప్రజల్లో తెలంగాణ భావజాలం పెరగడంతో అప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్.. టీఆర్ఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్‌తో తాము కలవడానికి సిద్ధమని టీఆర్ఎస్ ప్రకటించింది. దానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోవడంతో 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగింది.

ఈ ఎన్నికల్లో 42 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ 26 స్థానాలు గెలుచుకుంది. 6 లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి మహబూబ్ నగర్ మినహాయిస్తే మిగిలిన 5 చోట్ల గెలుపొందింది.

మరోవైపు కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చడంలో టీఆర్ఎస్ విజయం సాధించింది.

యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరడంతో టీఆర్ఎస్ కేంద్రం మంత్రివర్గంలో చేరింది.

షిష్పింగ్ శాఖ మంత్రిగా కేసీఆర్, మరో శాఖకు సహాయ మంత్రిగా ఆలే నరేంద్ర బాధ్యతలు చేపట్టారు.

అయితే, యూపీఏలో భాగస్వామిగా ఉన్న డీఎంకే పార్టీ తమకు షిప్పింగ్ శాఖ కావాలని పట్టుబట్టడంతో కేసీఆర్ తన శాఖను వదులుకున్నారు. దాదాపు 6 నెలల పాటు ఏ శాఖ లేని మంత్రిగా కేంద్రంలో కొనసాగారు.

తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు.

కేంద్ర ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అన్ని తెలంగాణ ఏర్పాటుపై అన్ని పార్టీల అభిప్రాయాన్ని కోరింది.

తెలంగాణకు అనుకూలంగా దాదాపు 36 పార్టీలు లేఖ ఇవ్వడంలో టీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది.

అయితే, యూపీఏ 1 పాలన ముగింపుదశకు వస్తున్నప్పటికీ తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటనలు వెలువడకపోవడంతో కేసీఆర్, ఆలే నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

టీఆర్ఎస్ పార్టీ

ఫొటో సోర్స్, kcr/fb

ఎంఎస్‌ఆర్ సవాల్... కేసీఆర్ రికార్డ్ విజయం

కాంగ్రెస్ వల్లే గెలిచి ఇన్నాళ్లు మంత్రి పదవి అనుభవించిన కేసీఆర్ దమ్ముంటే ఎంపీ స్థానానికి కూడా రాజీనామా చేసి గెలవాలని కాంగ్రెస్ సీనియర్ నేత మందాడి సత్యనారాయణ సవాలు విసిరారు. ఆ సవాలును తీసుకున్న కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు.

ఉపఎన్నికల సందర్భంలో కరీంనగర్ ఫలితం తెలంగాణకు రెఫరెండం అని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. కేసీఆర్ దాదాపు 2 లక్షల మెజారిటీతో మరోసారి ఎంపీగా గెలిచారు. కానీ, తెలంగాణ ఏర్పాటు విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాన్చివేత ధోరణే అవలంభించింది.

టీడీపీతో కూటమిగా..

కాంగ్రెస్ హయాంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో 2009 ఎన్నికల్లో టీడీపీతో టీఆర్ఎస్ జతకట్టింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే, టీడీపీ, టీఆర్ఎస్ కలసి మహాకూటమిగా బరిలోకి దిగాయి.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో, 2 ఎంపీ స్థానాల్లోనే గెలుపొందింది. కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.

టీఆర్ఎస్ పార్టీ

ఫొటో సోర్స్, kcr/fb

రాజీనామాలే అస్త్రాలు... చీలికలు, వైఫల్యాలు

ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ తగ్గుతోంది.. తెలంగాణ వాదం బలహీన పడుతోందని భావించిన ప్రతీసారి టీఆర్ఎస్ పార్టీ రాజీనామాలే అస్త్రంగా ప్రయోగించేది. అయితే, కొన్నిసార్లు ఈ వ్యూహం కూడా దెబ్బతిన్నది.

టీఆర్ఎస్ తన రాజకీయ ప్రస్థానంలో చాలా సార్లు చీలికలకు గురైంది. ఒకానొక దశలో పార్టీ మనుగడే ప్రశ్నార్థంగా మారే పరిస్థితిని ఎదుర్కొంది.

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగలేదు. రాష్ట్ర మంత్రివర్గం నుంచి బయటకు రావాలనుకున్న టీఆర్ఎస్ నిర్ణయం ఆ పార్టీలో తొలిసారి చీలికలకు దారితీసింది.

ఆ పార్టీకి చెందిన మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరారు.

తర్వాత వచ్చిన మండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను బలపరుస్తూ కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంతకాలు చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

2009 తర్వాత తెలంగాణ కోసం 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో తిరిగి ఏడుస్థానాల్లోనే టీఆర్ఎస్ విజయం సాధించింది.

ఈ వైఫల్యాలు టీఆర్ఎస్ పార్టీని భారీగా దెబ్బతీశాయి.

పార్టీకి అండగా ఉన్న అనేక మంది కీలక నేతలపై టీఆర్ఎస్ అనేకసార్లు బహిష్కరణ వేటు వేసింది.

విబేధాల కారణంగా పార్టీలో నెంబర్ 2 స్థాయిలో ఉన్న ఆలె నరేంద్రను టీఆర్ఎస్ పార్టీ బహిష్కరించడంతో రియల్ టీఆర్ఎస్‌ పేరుతో ఆయన మరో పార్టీని స్థాపించారు. తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో చేరారు.

తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన విజయశాంతి తన పార్టీని టీఆర్ఎస్ కలిపి ఆ పార్టీ తరఫున ఎంపీగా పనిచేశారు. 2014 ఎన్నికల వరకు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆమెపై కూడా టీఆర్ఎస్ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరారు.

మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ టీఆర్ఎస్‌ను వీడి తెలంగాణ విమోచన సమితి పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన టీజేఎస్‌లో కొనసాగుతున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న కీలక నేతలు డి.శ్రీనివాస్, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు ఒకప్పుడు టీఆర్ఎస్‌లో ఉన్నవారే.

టీఆర్ఎస్ పార్టీ

ఫొటో సోర్స్, kcr/fb

కేసీఆర్ ఆమరణ దీక్ష... పుంజుకున్న టీఆర్ఎస్

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనలు టీఆర్ఎస్‌కు కలసివచ్చాయి.

రోశయ్య హయాంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ వివాదం తెర ముందుకు రావడం ఉద్యమానికి ఆజ్యం పోసింది.

‘కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు దిగారు.

ఆయన దీక్షతో తెలంగాణలో ఉద్యమం ఉధృతం అయింది. దీంతో దిగివచ్చిన యూపీఏ2 ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబర్ 9న ఒక ప్రకటన చేసింది. కానీ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

తెలంగాణ ఏర్పాటుపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ దశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది. పొలిటికల్ జేఏసీ ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడిని తీవ్రం చేసింది.

టీజాక్ చేపట్టిన అన్ని ఉద్యమాల్లో టీఆర్ఎస్ కీలకభూమిక పోషించింది. మిలియన్ మార్చ్, వంటా వార్పు, సాగరహారం తదితర ఉద్యమాల్లో ముందుండి నడిచింది. ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై శ్రీకృష్ణ కమిటీకి ప్రత్యేక నివేదికలను తయారు చేసి ఇచ్చింది.

టీఆర్ఎస్ పార్టీ

ఫొటో సోర్స్, kcr/fb

తెలంగాణ ఏర్పాటు- టీఆర్ఎస్ అధికారం

ఎట్టకేలకు 2013లో యూపీఏ 2 ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

2014 మే నెలలో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్కా పొలిటికల్ పార్టీగా ఎన్నికల బరిలోకి దిగింది.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఎన్నికలకు వెళితే, తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు.

2014 జూన్ 2న కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది.

బంగారు తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నాలున్నరేళ్ల పాలనలో ఇక్కడి భౌగోళిక, సాంస్కృతిక అంశాలను మేళవించి పాలన సాగించింది.

పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రజలు మరోసారి టీఆర్ఎస్‌నే ఆదరించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన చాలా పార్టీలు చరిత్రలో కలిసిపోయాయి. కానీ, టీఆర్‌ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీగా చరిత్రకెక్కడమే కాకుండా రెండో విడత మరింత భారీ మెజారిటీతో అధికారాన్ని గెల్చుకుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)